Wednesday, May 16, 2012

వెజ్ పావ్ బాజీ.....!??







ఫాస్ట్‌ ఫుడ్‌ అనేది మన సంస్కృతి కాదు. ఇది పాశ్చాత్య ఆహార విధానం. అయితే.. పానీపూరీ, చాట్‌, పావ్‌ బాజీ వంటి ఉత్తరభారతీయ ఉపాహారాలు.. కాలగమనంలో ఫాస్ట్‌ఫుడ్‌ కేటగిరీలోకి వెళ్లాయి. అలాగే.. తెలుగు నాట మిర్చీబజ్జీ, ఆలూబజ్జీ, ఎగ్‌ బోండా వంటి కొన్ని రకాల చిరుతిళ్ళను ఫాస్ట్‌ ఫుడ్‌ కేటగిరీలో చేర్చవచ్చు. మహారాష్ట్ర విషయానికి వస్తే.. అక్కడ వడ పావ్‌ కు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. వెస్టర్న్‌ కల్చర్‌ నుండి వచ్చిన పిజ్జా, బర్గర్‌లు సంపన్నులకు చాలా ఏళ్ళతరబడి నుండే సుపరిచితం.. ఇప్పుడు బర్గర్ల సంస్కృతి మధ్యతర గతి వర్గాలను కూడా విపరీతంగా ఆకర్షిస్తోంది. వర్షాకాలం, శీతాకాలంలో.. ఈ తరహా ఆహారపదార్థాలకు విపరీతమైన క్రేజ్‌ లభిస్తుంది. చాలా ఫేమస్ ఐటం ఈ పావ్ భాజీ. ఈ మసాలాపొడి రెడీగా ఉంటే పావుగంటలో ఇంట్లోనే చేసెయ్యొచ్చు. అన్ని కూరగాయలతో ఎంతో రుచిగా ఉండే ఈ డిష్ ని పిల్లలూ చాలా ఇష్టపడతారు.

కావలసిన పదార్ధాలు:
పావ్: ఒక పాకెట్
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2-4
కరివేపాకు: రెండు రెమ్మలు
టమాటాలు: 3
ఉప్పు, కారం: రుచికి సరిపడా
పసుపు: 1/2tsp
పావ్ భాజీ మసాలా: 2tsp
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tsp
కొత్తిమీర: ఒక కట్ట
నిమ్మకాయ: ఒకటి
నూనె: సరిపడా
నెయ్యి : 2tbsp
ఆలూ(బంగాళదుంప): 3
కారట్, కాప్సికం, కాలిఫ్లవర్, పచ్చిబటానీ, కాబేజ్, బీన్స్: 1cup(అన్నీ కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసినవి)


తయారు చేయు విధానం:

1. ముందుగా పాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.


2. ఇప్పుడు సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి బాగా మగ్గిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, పావ్ భాజీ మసాలా వేసి నూనె తేలేవరకూ వేయించాలి.


3. ఇప్పుడు తరిగిన కూరగాయలు అన్నీ వేసి రెండు నిమిషాలు వేయించి తగినంత ఉప్పు, నీళ్ళు పోసి, మూతపెట్టి అయిదారు విజిల్స్ రానివ్వాలి.


4. కక్కర్ క్రిందికి దింపుకొని స్టీం(ఆవిరి)అంతా పోయాక ఉడికిన కూరగాయలని మెత్తగా మెదిపి రెండునిమిషాలు కూర చిక్కబడేవరకూ ఉడికించి కొత్తిమీర చల్లి దింపెయ్యాలి.


5. తర్వాత పావ్ ని మధ్యకి కట్ చేసి నెయ్యి వేడి చేసి పేనం పై కొంచెం వేయించాలి. వేడివేడిగా పావ్ లను కూరతో సర్వ్ చేస్తే ఘుమఘుమలాడే పావ్ భాజీ ఊరిస్తుంది.


సర్వ్ చేసేటప్పుడు కూరలో నిమ్మరసం పిండి కొత్తిమీర తరగును గార్నిష్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.